తీవ్రవాదుల చేతిలో భారత జవాన్ కిడ్నాప్..!  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 10:44 AM IST
తీవ్రవాదుల చేతిలో భారత జవాన్ కిడ్నాప్..!  

తీవ్రవాదుల చేతిలో భారత జవాన్ కిడ్నాప్ అయినట్లు అధికారులు భావిస్తూ ఉన్నారు. జమ్మూ కశ్మీర్ కు చెందిన షకీర్ మంజూర్ భారత సైన్యంలో 162 బెటాలియన్ లో జవానుగా పనిచేస్తున్నాడు. షకీర్ బక్రీద్ పండుగకు సెలవుపై స్వగ్రామానికి వెళ్లాడు. షోపియాన్ కు వెళ్లిన షకీర్ ప్రస్తుతం కనిపించకుండా పోయాడని భారత ఆర్మీ అనుమానిస్తోంది. ఆదివారం సాయంత్రం కుల్గాం జిల్లా బోర్డర్ వద్ద అతని కారు సగం కాలిపోయి కనిపించింది. తీవ్రవాదులు దాడి చేసి కిడ్నాప్ చేసి ఉంటారని, అతడి కారును తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత సైన్యం షకీర్ జాడ కోసం గాలిస్తోంది.

దగ్ధమైన కారు కుల్గ్రామ్ జిల్లా రంభామా ప్రాంతంలో కనిపించింది. దీంతో షోపియాన్, కుల్ గ్రామ్, అనంత్ నాగ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టారు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో గాలిస్తున్నారు. అతడిని ఏమీ చేయకుండా వదిలిపెట్టాలని మంజూర్ కుటుంబం అర్థిస్తోంది.

డ్యూటీ నుండి కొద్దిరోజుల పాటూ విశ్రాంతి తీసుకోవాలని అనుకున్న సైనికులను తీవ్రవాదులు టార్గెట్ చేస్తూ ఉన్నారు. గత మూడేళ్లుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూ ఉన్నాయి.

లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ 2017 మే నెలలో షోపియాన్ లో ఓ పెళ్ళికి హాజరయ్యాడు. ఆ సమయంలో అతడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాతి రోజు పెళ్లి జరిగిన ప్రదేశానికి 30 కిలోమీటర్ల దూరంలో తూట్లు పడిన ఉమర్ ఫయాజ్ మృతదేహం కనిపించింది. 22 సంవత్సరాల ఉమర్ ఫయాజ్ ఉద్యోగంలో జాయిన్ అయిన అయిదు నెలలకే మరణించడం అప్పట్లో తీవ్ర సంచలమైంది.

2018 జూన్ నెలలో మరో జవాన్ ఔరంగజేబ్.. ఈద్ పర్వదినాన్ని కుటుంబంతో గడుపుదామని అనుకున్నాడు. ఆయన్ను కూడా కిడ్నాప్ చేసి చంపేశారు.

Next Story