ట్రంప్ మాట విని ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 March 2020 2:35 AM GMT
ట్రంప్ మాట విని ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారికి ఎంతోమంది బలి అవుతున్నారు. దీనిని అంతమొందించడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికి ఎలాంటి మందులు కనిపెట్టలేదు. అయితే.. ప్రజలో, ప్రజా ప్రతినిధులలో ఎవరో ఒకరు, ఏదో ఒక పేరు చెప్పటం, దానినే మందుగా అందరూ భావించటం గత కొంత కాలంగా జరుగుతోంది.

అరిజోనాలోని మేరీకోపా కౌంటీకి చెందిన 60 ఏళ్ళ వయసు పైబడిన దంపతులు ఇటీవల కరోనా వైరస్ గురించి విన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మహమ్మారిని నిరోధించడంలో క్లోరోక్విన్‌ గొప్పగా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పడం గమనించారు. అందుకోసం ఇంటర్‌నెట్‌లో సెర్చింగ్ చేసి క్లోరోక్విన్ గురించి చదివారు. నిజానికి వారికి కరోనా వ్యాధి నిర్ధారణ కూడా కాలేదు. అయినప్పటికీ సొంతవైద్యానికి పాల్పడ్డారు. యాంటీ మలేరియా డ్రగ్‌లో ఉపయోగించే మందును వారిద్దరు తీసుకున్నారు. వెంటనే ఇద్దరికీ వాంతులు, తల తిప్పడం ప్రారంభమయ్యాయి.

ఆ వెంటనే వారిద్దరూ స్పృహ కోల్పోగా, ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మలేరియా నివారణకు వాడే క్లోరోక్విన్ ను కరోనాకు వ్యాక్సిన్ లా భావించవద్దని డాక్టర్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయినా క్లోరోక్విన్ డ్రగ్ ను కొనేందుకు మెడికల్ షాపుల ముందు జనాలు బారులు తీరుతున్నారు.

ఈ విషయమై స్పందించినవైద్య అధికారులు కోవిడ్-19కు చికిత్సకు సంబంధించి ఇంటర్నెట్‌లో తప్పుడు సమాచారం చాలా ఉందని చెప్పారు. సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్పే మాటలను, ఇచ్చే సలహాలను మాత్రమే ప్రజలు పాటించాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య శాఖ అధికారులు అందజేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని హెచ్చిరించారు.

Next Story