స్ట్రయిక్‌ ఆఫ్‌ డ్రైవ్‌.. ఫలితం 971 కంపెనీలు రద్దు..!

By అంజి  Published on  14 Dec 2019 5:27 AM GMT
స్ట్రయిక్‌ ఆఫ్‌ డ్రైవ్‌.. ఫలితం 971 కంపెనీలు రద్దు..!

ముఖ్యాంశాలు

  • ఏపీలో 971 షెల్‌ కంపెనీలను రద్దు చేసిన ఆర్‌ఓసీ
  • కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు
  • బ్యాంక్‌ అకౌంట్లను కూడా ఫ్రీజ్‌ చేసిన ఆర్‌ఓసీ

అమరావతి: రాష్ట్రంలో సుమారు 971 డొల్ల కంపెనీలకు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీలకు చెక్‌ పెట్టింది. నిబంధనల ప్రకారం కంపెనీలు రెండేళ్ల పాటు వార్షిక నివేదికలు సమర్పించకపోవడంతో రద్దు చేసింది. ఈ కంపెనీలు రిటర్నలను దాఖలు చేయలేదని కంపెనీల వర్గాల నుంచి తెలుస్తోంది. కంపెనీలకు సంబంధించిన బ్యాంక్‌ ఖాతాలను ఆర్‌ఓసీ ఫ్రీజ్‌ చేసింది. 2017 నుంచి స్ట్రయిక్‌ ఆఫ్‌ డ్రైవ్‌ పేరుతో వార్షిక నివేదికలు, రిటర్న్‌లు సమర్పించని కంపెనీలను ఆర్‌ఓసీ రద్దు చేస్తున్నట్లు తెలుస్తుంది. వార్షిక నివేదికలు, రిటర్న్‌లు సమర్పించని డొల్ల కంపెనీల రద్దుకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఆర్‌వోసీ ఆంధ్రప్రదేశ్‌లోని 971 కంపెనీలను రద్దు చేసినట్టు సమాచారం. డొల్ల కంపెనీలకు ఆర్‌వోసీ నోటీసులు ఇచ్చి ఇలా రద్దు చేయడం మూడో సారి.

2016-17, 2017-18కి సంబంధించిన వార్షిక నివేదికలను కంపెనీలు ఆరోవోసీకి దాఖలు చేయాలి. కాగా నివేదికలు, రిటర్న్‌లు సమర్పించని ఆర్‌వోసీ ఆగస్టులో నోటీసులు జారీ చేసింది. నివేదికల సమర్పణకు నెల రోజులు గడువు ఇచ్చినట్టుగా ఆర్‌ఓసీ అధికారి ఒకరు తెలిపారు. ఏపీలో రిటర్న్‌లు, వార్షిక నివేదికలను దాఖలు చేయని 1,305 కంపెనీలను అధికారులు గుర్తించారు. మొత్తంగా కొన్ని కంపెనీలు వార్షిక నివేదికలు, సమర్పించాయి. మరికొన్ని కోర్టు కేసుల కారణంగా సమర్పించలేకపోయాయి. కొన్ని కంపెనీల రికార్డులు ఐటీ శాఖల దగ్గర ఉండగా.. మిగిలిన 971 కంపెనీలను ఆర్‌వోసీ రద్దు చేసింది. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీల చట్టం సెక్షన్‌ 248 కింద కంపెనీలను రద్దు చేస్తోంది. దేశంలో 80 వేల నుంచి లక్ష కంపెనీలు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో దాదాపుగా 3,410 కంపెనీలు రిట్నర్‌లను, నివేదికలను సమర్పించలేదని కంపెనీల వర్గాల నుంచి తెలసుస్తోంది.

బ్యాంక్‌ అకౌంట్లు ఫ్రీజ్‌..

ఆంధ్రప్రదేశ్‌లో 971 డొల్ల కంపెనీలను రద్దు చేసిన ఆర్‌వోసీ.. వాటికి సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్లను ఫ్రీజ్‌ చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ల సహకారంతో కంపెనీల బ్యాంక్‌ అకౌంట్లను ఆర్‌ఓసీ స్తంభింపజేసింది. ఐటీశాఖ, కేంద్ర జీఎస్‌టీ సంస్థలకు కంపెనీలు ఏమైనా బకాయిలు ఉన్నాయా? అని ఆర్‌ఓసీ ముందే తెలుసుకుంది. అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతోనే కంపెనీలను ఆర్‌ఓసీ రద్దు చేసింది. 2015 నుంచి వరుసగా మూడేళ్ల పాటు రిటర్న్‌లు, నివేదికలు సమర్పించని కంపెనీలపై ఆర్‌వోసీ వేటు వేసింది. కంపెనీల డైరెక్టర్లను కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 164 ప్రకారం వీరిని అనర్హులుగా పేర్కొంది. అనర్హత పొందిన డైరెక్టర్లు వేరే కంపెనీలలో పని చేయడానికి వీలు లేదు, ఐదేళ్ల పాటు డైరెక్టర్‌ హోదాలో పని చేయకుండా నిషేధం విధించింది.

ఏపీలో రద్దయిన 971 కంపెనీల బ్యాంకు ఖాతాలను ఒకేసారి సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. గతంలో తలెత్తిన న్యాయపరమైన ఇబ్బందులు, ఎన్‌సీఎల్‌టీ వివాదాలకు తావు లేకుండా.. రద్దు చేసే కంపెనీల జాబితాను ఎన్‌సీఎల్‌టీకి పంపారు. ఆదాయపు పన్ను, జీఎస్‌టీ అధికారులకు కూడా సమాచారం అందించి, వారు పచ్చజెండా ఊపిన తర్వాత డొల్ల కంపెనీలను ఆర్‌ఓసీ రద్దు చేసింది. రద్దైన కంపెనీలు తమ గుర్తింపును తిరిగి పొందడానికి ఎన్‌సీఎల్‌టీకి వెళ్లాల్సి ఉంటుంది. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఎన్‌సీఎల్‌టీ అమరావతి బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని ఆర్‌ఓసీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Next Story