అప్పటి వరకూ పది పరీక్షలు లేవ్..
By తోట వంశీ కుమార్ Published on 28 April 2020 7:27 PM ISTఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. త్వరలోనే పరీక్షలకు సంబందించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ తయారు చేస్తున్నామన్నారు. మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఆన్‌లైన్, డిజిటల్ తరగతుల నిర్వహణ మరింత పెరగాలని కేంద్ర మంత్రి సూచించారు.
లాక్ డౌన్ కారణంగా ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థలు కూడా మూతబడ్డాయి. కాగా 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పంపాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.