ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం మరో పథకాన్ని ప్రవేశపెట్టారు. మంగళవారం ఉదయం ఈ పథకాన్ని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం జిల్లాల కలెక్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ఈ విద్యాదీవెన పథకాన్ని తాను మరోసారి అమల్లోకి తీసుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు జగన్. పేదలంతా పెద్ద చదువులు చదవడంతోనే పేదరికాన్ని అణచివేయగలమన్న సంకల్పంతో ఈ విద్యాదీవెన పథకాన్ని నాన్న తీసుకొచ్చారన్నారు.

Also Read : ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోండయ్యా!

రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా తమ పిల్లల చదువులపై భరోసా ఉండేదన్నారు. ఆయనతర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేసిందని, చాలీచాలని ఫీజు రీయంబర్స్ మెంట్లు ఇవ్వడం, ఎక్కడ ఫీజులను కత్తిరించాలన్న అన్న ఆలోచనా ధోరణి పథకాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కేశారని విమర్శించారు.

'' నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో గోపాల్ అనే వ్యక్తి కొడుకుకి నివాళులు అర్పిస్తున్నాడు. ఏమైందన్నా అని అడిగితే..ఇంటర్ లో మంచి మార్కులొచ్చాయి. తర్వాత ఇంజినీరింగ్ చదువుతానంటే కాలేజీలో చేర్పించాను కానీ..ప్రభుత్వమిచ్చే ఫీజు రీఎంబర్స్ మెంట్ సరిపోకపోయేవి. బోర్డింగ్ మెస్ ఛార్జీలు లక్ష రూపాయల పైనే కట్టాలి. ఆ ఫీజు కట్టే స్తోమత లేకపోయినా ఎలాగో అలా కడదామనుకున్నా. కానీ నా కొడుకు ఫీజు కట్టడం కోసం కుటుంబం కొవ్వొత్తిలా కరిగిపోవడం ఇష్టం లేక అర్థంతరంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని తన గోడును చెప్పాడు.''

Also Read : సమంత కోసం కేక్ ప్రిపేర్ చేసిన చైతూ

అందుకే ఇకపై ఎవరూ అప్పులపాలై, చదువుకునేందుకు ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోకూడదనే బోర్డింగ్, లాడ్జింగ్ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం విద్యాదీవెన పథకాలను తీసుకొస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.

ఈ పథకం ద్వారా తొలి విడతలో మార్చి 31వ తేదీ వరకూ పెండింగ్ లో ఉన్న అన్నిఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా తొలిసారి రూ.1880 కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లిస్తున్నామని, అలాగే నాలుగు త్రైమాసికాలకు ఇవ్వాల్సిన డబ్బులను ఒకేసారి ఇస్తున్నామన్నారు.

రాణి యార్లగడ్డ

Next Story