ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2020 3:34 AM GMT
ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు

రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి పెట్రోల్, డీజిల్ పై ఒక్క రూపాయి సెస్ విదిస్తున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం రోడ్ల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రోడ్ డెవలప్ మెంట్ సెస్ ద్వారా సంవత్సరానికి రానున్న రూ. 500 కోట్ల ఆదాయాన్ని ప్రత్యేకించి రోడ్ల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కొరకు మాత్రమే వినియోగించేందుకు వీలుగా రోడ్ల డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేస్తారని ఆయన వివరించారు.

కోవిడ్ నియంత్రణలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ సూచనల మేరకు గత మార్చి 23 నుండి లాక్ డౌన్ విధించిన కారణంగా ఆర్ధిక కార్యకలాపాలు మందగించి రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ లో రాష్ట్ర రెవెన్యూ రూ. 4,480 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లో కేవలం రూ. 1,323 కోట్లు మాత్రమే ఉందన్నారు. అంచనా వేసిన ఆదాయంలో ఇది కేవలం 29.5 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు.

మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో కూడా పరిస్థితులు ఇందుకు ఏ మాత్రం భిన్నంగా లేవన్నారు. ఒకవైపు రాష్ట్రానికి రావలసిన ఆదాయం తగ్గిపోవడంతో పాటు కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా వైద్య, ఆరోగ్య సేవలకు అధిక మొత్తంలో ఖర్చు చేయడం, మరొక వైపు అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ఖర్చు చేయవలసి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఒత్తిడి పెరిగిందని, ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత రోడ్ల అభివృద్దికి నిధులు ఖర్చు చేయవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని మంత్రి మండలి నిర్ణయం మేరకు పెట్రోల్, డీజిల్ పై ప్రస్తుతం ఉన్న పన్నులకు అదనంగా రోడ్ల అభివృద్ధికి గాను ఒక్క రూపాయి సెస్ ను విధించిందన్నారు.

ఈ మేరకు ఏపీ వాట్ చట్టం 2005 కు సవరణలు చేస్తూ ప్రతిపాదించిన ఆర్డినెన్స్ కు శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలిపారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు.

Next Story