ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రవేశపెట్టిన శాసన మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శాసనమండలి రద్దుకు ఓటింగ్‌ నిర్వహించగా, 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు.  అనంతరం  తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ పేర్కొన్నారు. కాగా మండలిని రద్దు చేయాలని సోమవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చ

శాసన మండలి రద్దు విషయమై సభ్యులు రోజంతా సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులందరూ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మండలి రద్దుపై మాట్లాడిన సీఎం జగన్‌.. రద్దుకు ఆమోదం తెలుపాలని సభ్యులను కోరారు. అనంతరం సభలో ఓటింగ్‌ కొనసాగింది. పార్లమెంట్‌ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.