ఒక వైపు హైకోర్టులో పిటిషన్లు.. మరో వైపు జగన్ దూకుడు
By సుభాష్
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. కొత్త రాజధాని సందర్భంగా కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్న కారణంగా ఒక వైపు హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతుండగా,..మరో వైపు రాజధానుల విషయంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. ఏపీ విజిలెన్స్ కమిషన్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ కార్యాలయాలతో పాటు ఇతర కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెం.13 చట్ట విరుద్దమని, విచారణ జరపాలని కోరారు. దీనిపై కోర్టులో మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌లో ప్రభుత్వంతోపాటు సీఆర్డీఏ చైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా చేర్చారు.
గత శనివారమే జీవో జారీ
కాగా, ఈ కార్యాలయాల తరలిస్తున్నట్లు ప్రభుత్వం గత శనివారమే జీవో ఇచ్చింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలు గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యాలయాలను తక్షణమే కర్నూలు తరలించడం కోసం భవనాలను గుర్తించాలని ఆర్‌అండ్‌బి చీఫ్ ఇంజనీర్, కర్నూలు జిల్లా కలెక్టర్లను జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పేరిట ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.