ఆ మీడియా సంస్థలపై కన్నెర్రజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2020 3:15 AM GMT
ఆ మీడియా సంస్థలపై కన్నెర్రజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం, టీవీ 5 సంస్థ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై లేని పోనివి రాస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది.

‘న్యాయమూర్తులపై నిఘా’ అంటూ ఆంధ్రజ్యోతి, టీవీ 5 వార్తా సంస్థల్లో కథనాలు రావడంతో ఆ రెండు మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలకు సన్నద్ధమైంది. పరువునష్టం దావా సహా, చట్టపరమైన చర్యలపై ప్రభుత్వం యంత్రాంగం దృష్టి సారించింది. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా కథనాలను అల్లారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఓ పక్కా వ్యూహంతోనే న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన చర్యలకు పూనుకుంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కె.శ్రీనివాసరెడ్డి శనివారం ఆమోద బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ ప్రై వేట్‌ లిమిటెడ్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్, పబ్లిషర్‌ కోగంటి వెంకట శేషగిరిరావులకు లీగల్‌ నోటీసు పంపారు.

రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థల, సంస్థల స్వతంత్రతను, స్వయం ప్రతిపత్తిని కాపాడే బాధ్యతను ఈ ప్రభుత్వం సక్రమంగా నెరవేరుస్తోంది. కొందరు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం నిఘా పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ఎజెండాలో భాగంగానే ఈ కథనాన్ని ప్రచురించారు. ఈ కథనంపై వెంటనే బేషరతు క్షమాపణలు చెప్పాలి. లేనిపక్షంలో ప్రభుత్వం తీసుకునే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె. శ్రీనివాసరెడ్డి లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు.

‘న్యాయ దేవతపై నిఘా’ పేరుతో ప్రచురించిన కథనం వెనుక నేరపూరిత కుట్ర ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ కథనంలో రాసిన వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు ఏవీ కూడా ఆంధ్రజ్యోతి ఆరోపించిన చర్యలకు పాల్పడలేదని ప్రభుత్వం తెలిపింది.

మీ ఎజెండా ప్రకారం క్రియాశీలకంగా నడుచుకునే వ్యక్తులతో కలిసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్రలో భాగంగా ఈ కథనాన్ని ప్రచురించారని ప్రభుత్వం చెబుతోంది. ఈ కథనాన్ని ప్రచురిస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని తెలిసే మీరు ఈ పనిచేశారని.. వాస్తవాల ఆధారంగా కథనాలు ప్రచురించాల్సింది పోయి, సంబంధం లేని వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని లాగారని ఏపీ ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది.

Next Story