జగన్ నివాసం కోసం 35 లక్షలు కేటాయింపు...జీవో జారీ చేసిన సర్కార్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2019 11:09 AM ISTఏపీలో మరో దుమారం రేగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత నివాసం,ఇతర వాటికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్ హైదరాబాద్‌లోని తన నివాసంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ఇతర పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.35.5 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు ఓ జీవోను కూడా జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియట్, ఎల్-బ్లాక్ నుంచి తొలగించిన సీసీటీవీ కెమెరాలను లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఏర్పాటు చేయడానికి, సోలార్ పవర్ ఫెన్సింగ్ సిస్టంను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం రూ.18 లక్షలు మంజూరు చేస్తూ జీవోలో పేర్కొంది. అలాగే వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునే బూమ్ బారియర్ల ఏర్పాటుకు రూ.8 లక్షలు కేటాయించింది. లోటస్ పాండ్‌లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, అలాగే రెసిడెన్స్ వద్ద పోలీస్ బారక్‌లకు సంబంధించిన ఎలక్ట్రిక్ పనుల కోసం రూ.4.50 లక్షలను కేటాయించారు. కాగా, ఇంకా మరో రూ.5 లక్షలు కూడా మంజూరు చేసింది. జగన్ నివాసం వద్ద ఎలక్ట్రికల్ కు సంబంధించిన వ్యవహారాలను చూసుకోవడానికి సిబ్బందిని నియమించడం కోసం రూ.5 లక్షలను కేటాయిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. వీటి మొత్తం విలువ రూ.35.50 లక్షలు.
తాడేపల్లి నివాసం కోసం..
తాడేపల్లిలోని ముఖ్మంత్రి నివాసానికి అల్యూమినియం కిటికీలు, తలుపుల కోసం రూ.73 లక్షలు కేటాయిస్తూ నవంబర్ తొలి వారంలో ఏపీ సర్కారు జీవో జారీ చేసింది. కాగా.. హెలీప్యాడ్ నిర్మాణానికి రూ.1.89 కోట్లు, బారికేడింగ్ కోసం రూ.75 లక్షలు, పోలీస్ బ్యారక్ అండ్ టాయిలెట్ బ్లాక్‌కు రూ.30 లక్షలు, సెక్యూరిటీ పోస్ట్స్, గేట్స్, పోర్టబుల్ క్యాబిన్స్ ఏర్పాటుకు రూ.31 లక్షలు కేటాయించింది. అలాగే గార్డ్ రూమ్ అండ్ టాయిలెట్ బ్లాక్‌కు మరో రూ.13.5 లక్షల నిధులు కేటాయించారంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. రూపాయి జీతం అని చెప్పుకుంటున్న జగన్ ఇంత భారీ మొత్తంలో ఎలా ఖర్చు చేస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే వీటి ఏర్పాటుకు ఖర్చు చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ నివాసం మరమ్మతులు,ఇతర పనులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్ కేటాయింపుపై సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారుతోంది. తన సొంత నివాసం కోసం ప్రభుత్వం ఇంత బడ్జెట్ కేటాయించడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.