ఏపీ కేబినెట్ భేటీ.. కొత్త జిల్లాలపై కీలక నిర్ణయం
By సుభాష్ Published on 15 July 2020 8:32 AM GMTఏపీ మంత్రివర్గం సమావేశమైంది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో 22 అంశాలపై చర్చించింది. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ కేబినెట్ భేటీలో కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మార్చి 31లోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమాశంలో ఏపీ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో 3,7 సెక్షన్లను సవరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక పగటిపూట 9 గంటల విద్యుత్ రైతులకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అలాగే రాయలసీమ కరువు నివారణ అభివృద్ధి ప్రాజెక్టు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంపై, గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు నిధులు పరిహారం కేటాయింపుపై కేబినెట్‌లో చర్చించారు. అలాగే ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రైవేటు లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే అంశంపై చర్చించారు.
తొమ్మిదిన్నర కోట్లతో కర్నూలు జిల్లాలో వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు హోం సైన్స్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.