ఏపీలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2020 8:29 AM GMT
ఏపీలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

హిందూ ఆలయాల‌పై దాడుల నేఫ‌థ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఈరోజు ఛలో అమలాపురంకు పిలుపునిచ్చారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేయ‌డంతో పాటు.. ముఖ్య‌ నేత‌లు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణల‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా సోము‌ వీర్రాజు మాట్లాడుతూ.. హిందూవాదులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని‌ అడ్డంకులు సృష్టించినా.. చలో అమలాపురం ఈరోజు జరిగి తీరుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని నిప్పులు చెరిగారు.

ఇక‌.. ఛలో అమలాపురం నేఫ‌థ్యంలో అమలాపురానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలావుంటే.. కొవిడ్‌-19ను దృష్టిలో ఉంచుకుని అమలాపురం రెవెన్యూ డివిజన్ అంతటా సెక్షన్ 144 విధించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ కెవీ మోహన్ రావు తెలిపారు. మహమ్మారి విజృంభ‌ణ నేఫ‌థ్యంలో ఛ‌లో అమలాపురానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు. సెక్షన్ 144 ను ఉల్లంఘించిన వారిపై చర్యలు త‌ప్ప‌వ‌ని ఆయ‌న అన్నారు.

అలాగే.. ప్రకాశం జిల్లా కారంచేడులో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ‘ఛలో అమలాపురం’ కార్యక్రమానికి వెళ్ళకుండా ముందస్తుగా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది.

మరోవైపు మాజీమంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబును హనుమాన్ జంక్షన్‌లో పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే.. అమలాపురం గడియారం స్తంభం వద్ద బైఠాయించిన బీజేపీ మహిళ నేత యామిని శర్మతో పాటు మరికొందరు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Next Story