ఏపీ ఏజీ ప్రెస్ మీట్ అసాధారణం ఎందుకు? ఇప్పుడేం జరగనుంది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 May 2020 6:54 AM GMT
ఏపీ ఏజీ ప్రెస్ మీట్ అసాధారణం ఎందుకు? ఇప్పుడేం జరగనుంది?

అనూహ్య పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. ప్రపంచమంతా మాయదారి రోగానికి సంబంధించిన అంశాల్లో బిజీగా ఉంటే.. అందుకు భిన్నంగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. తనకు నచ్చని వాటి విషయంలో ఎంతవరకైనా వెళ్లేందుకు ఓకే అన్నట్లు వ్యవహరించే జగన్ సర్కారు.. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై వ్యవహరించిన తీరు కొత్త చర్చకు తెర తీసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. అందుకోసం ఏకంగా ఒక ఆర్డినెన్సును జారీ చేయటం తెలిసిందే. ఈ వివాదంపై రెండు రోజుల క్రితం ఏపీ హైకోర్టు తీర్పునిస్తూ.. రమేశ్ కుమార్ ను తొలగించిన వైనం చెల్లదని.. ఆయన్ను ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే తాను ఏపీ ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టినట్లుగా రమేశ్ కుమార్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. దీంతో.. ఏపీ సర్కారుకు చిరాకు తెప్పించింది.

తాను వద్దనుకున్న అధికారి తాను వద్దన్న పదవిలో ఉండటం ఏమిటన్న దానిపై గుర్రుగా ఉంది. కోర్టు తీర్పు వెలువడిన ఒకటిన్నర రోజు గడిచిన తర్వాత అనూహ్య పరిణామాలకు తెర తీసింది. శనివారం రాత్రి ఏపీ అడ్వొకేట్ జనరల్ అసాధారణ రీతిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో శ్రీరాంతో పాటు.. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్వి ప్రవీణ్ ప్రకాశ్ తో పాటు.. పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ చెరోవైపు కూర్చున్న వేళ శ్రీరాం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఆయన చెప్పిన విషయాలన్నింటి సారాంశాన్ని చూస్తే.. ‘‘నిమ్మగడ్డ స్వయంగా తనను తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రకటించుకోవటం చట్టవిరుద్ధం. ఆయన్ను ఆ పోస్టులో మళ్లీ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందే తప్పించి.. ఆయనే స్వయంగా ఆ పోస్టులో వెళ్లి కూర్చునే వెసులుబాటు లేదు. హైకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. రమేశ్ కుమార్ నియామకమే చట్టవిరుద్ధం. ఆయన్ను మళ్లీ ఆ పోస్టులో నియమించి ప్రభుత్వం మరో తప్పు చేయాలా? హైకోర్టు ఆదేశాల అమలుకు ప్రభుత్వం వద్ద రెండు నెలల సమయం ఉంది. ప్రభుత్వం ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటాం’’ అని పేర్కొన్నారు.

ఏజీ ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటికే ఏపీ ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ జారీ అయ్యింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికంగా చూస్తే.. ఏపీ సర్కారు తప్పు చేసినట్లుకాదన్న వాదన బలంగా వినిపిస్తున్నారు. అయితే.. హైకోర్టు తీర్పుపై అడ్వొకేట్ జనరల్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించటం తొలిసారి చూస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. దాని మీద తన వాదనలు వినిపిస్తూ అటార్నీ జనరల్ విలేకర్ల ముందుకు వచ్చిన పరిస్థితి ఇప్పటివరకూ రాలేదని తేల్చి చెబుతున్నారు. అడ్వొకేట్ జనరల్ ప్రెస్ మీట్ చూస్తే.. తాజా పరిణామాల విషయంలో ఆయన సహనం లేదన్నట్లుగా ఉందని కొందరు తప్పు పడుతున్నారు. రమేశ్ కుమార్ ఆదేశాల్ని తాము లెక్క చేయమన్న ఏజీ వ్యాఖ్యలు కోర్టు ఆదేశాల్ని ధిక్కరించినట్లేనన్న వాదనను వినిపిస్తున్నారు. ఏమైనా.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎపిసోడ్ రానున్న రోజుల్లో మరిన్ని చిక్కుముడులు వేయటమే కాదు.. ఏపీ హైకోర్టు ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Next Story