ఆరోగ్య రంగంలో మార్పులు: సీఎం జగన్‌

By సుభాష్  Published on  16 July 2020 2:11 PM IST
ఆరోగ్య రంగంలో మార్పులు: సీఎం జగన్‌

ఆరోగ్య రంగంలో పూర్తిగా మార్పులు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ అన్నారు. గురువారం తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. నేటి నుంచి ఆరు జిల్లాల్లో మరిన్ని సేవలతో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించననున్నట్లు చెప్పారు. పైలట్‌ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లాలో జనవరి 3 నుంచి అమలు చేస్తామని, తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, వైఎస్సార్‌, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో అమలులోకి రానున్నట్లు చెప్పారు.

జాతీయ ప్రమాణాల దిశగా ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతినెట్‌ వర్క్‌ ఆస్పత్రిని గ్రేడింగ్‌ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రులు అంటేనే భయపడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి భయం లేకుండా బయట ఎక్కడ దొరకని మందులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే లభించేలా చేస్తున్నామన్నారు.

ప్రతి గ్రామానికి వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌

ప్రతి గ్రామానికి వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ తీసుకొస్తున్నామని, అందులో 57 రకాల మందులు అందుబాటులో ఉంటాయని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 65 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించామని, అలాగే 1.29 లక్షల మంది చిన్నారులకు కంటి అద్దాలను సైతం ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. ఇక కొత్తగా 27 టీచింగ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేయబోతున్నామని జగన్‌ వెల్లడించారు.

Next Story