మతాల మధ్య చిచ్చు పెడతారా ? ప్రతిపక్షాలను నిలదీసిన ఎపిక్ ఫోరం

By సుభాష్  Published on  12 Sept 2020 12:01 PM IST
మతాల మధ్య చిచ్చు పెడతారా ? ప్రతిపక్షాలను నిలదీసిన ఎపిక్ ఫోరం

అంతర్వేది ఘటన విషయంలో ప్రతిపక్షాల వైఖరిపై ఏపి ఇంటలెక్చువల్ అండ్ సిటిజన్ ఫోరం (ఎపిక్ ఫోరం) మండిపడింది. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం రథం దగ్దం అయిన ఘటనను ఘటనగా చూడకుండా మతపరమైన రంగు పులమటం ఏమిటంటూ టిడిపి+బిజెపి+జనసేనలను నిలదీసింది. జరిగిన ఘటనను ఎవరు సమర్ధించటం లేదని, ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ఫోరం డిమాండ్ చేసింది. అయిదే ఇదే సమయంలో ఘటనకు మతంరంగును పులిమేసి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించటం మంచిది కాదంటూ హితవు పలికింది.

రథం దగ్దం అయిన ఘటనలో ఇంతగా రెచ్చిపోతున్న టిడిపి, బిజెపి, జనసేనలు విజయవాడలోని స్వర్ణాప్యాలెస్ దగ్దమైన ఘటనలో పదిమంది చనిపోయినా ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీసింది. మరి ఫోరం వేసిన ఈ ప్రశ్నకు చంద్రబాబునాయుడు, సోమువీర్రాజు, పవన్ కల్యాణ్ ఏమని సమాధానం చెబుతారో ? అసలు సమాధానం చెబుతారా ? అనేది కూడా డౌటే. టిడిపి హయాంలో విజయవాడలో 45 దేవాలయాలను కూల్చేసినపుడు, గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినపుడు పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదంటూ ఫోరం నిలదీసింది.

హిందువులను రెచ్చగొట్టేట్లుగా ప్రకటనలు ఎవరు చేసినా తప్పేనంటూ ఫోరం అభిప్రాయపడింది. దయచేసి ఘటన ఆధారంగా రాజకీయ లబ్దికి ఎవరు ప్రయత్నం చేయొద్దని కూడా ఫోరం విజ్ఞప్తి చేసింది. ఘటనను ఘటనాగానే చూడాలని సిబిఐ దర్యాప్తుకు అందరు సహకరించాలని కూడా ఫోరం పిలుపిచ్చింది.

Next Story