మూగ జీవాలకు హెల్త్ కార్డులు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
By సుభాష్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. బుధవారం మహిళ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వైఎస్సార్ కాపు నేస్తం' పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూగ జీవాలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా 'వైఎస్సార్ పశు సంరక్షణ' పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా గొర్రెలు, మేకల కాపరులు, యజమానులకు లబ్ది చేకూరనుంది.
ఈ పథకంలో మూగజీవాలకు హెల్త్ కార్డులను జారీ చేయనుంది ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల్లో పశువైద్య సహాయకులను అందుబాటులో ఉంచనున్నారు అధికారులు. అంతేకాకుండా పశువులకు ఏదైన సమస్య వస్తే పరిష్కారం కోసం పశుసంవర్ధకశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 085-00-00–1962, లేదా రైతు భరోసా కేంద్రాల టోల్ ఫ్రీ నెంబర్ 1907 కు కాల్ చేయాలని సూచించారు.
ఈ పథకం ద్వారా నష్టపరిహారం ఇలా..
ఈ పథకం 2 నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న ఆవులను, 3 నుంచి 12 ఏళ్లు వయసున్న బర్రెలకు వర్తించనుంది. పశువులు మరణిస్తే మేలు జాతీ స్వదేశీ అవుకు రూ.30వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేలు పరిహారం అందనుంది. అలాగే సంవత్సరానికి ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.1.50 లక్షలు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఆరు నెలల.. ఆపై వయసున్న గొర్రెలు, మేకలను ఈ పథకం కింద వర్తింపజేసింది ప్రభుత్వం. ఒకేసారి మూడు కంటే ఎక్కువ సంఖ్యలో మూగజీవాలు మరణించినట్లయితే ఈ పథకాన్ని అందిస్తారు.