ఏపీ ముఖ్యమంత్రికి పెరిగిన ప్రజామద్దతు.. ఏడాది పాలనపై సీపీఎస్‌ సర్వే

By సుభాష్  Published on  22 Jun 2020 9:36 AM GMT
ఏపీ ముఖ్యమంత్రికి పెరిగిన ప్రజామద్దతు.. ఏడాది పాలనపై సీపీఎస్‌ సర్వే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రజామద్దతు భారీగా పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా.. భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు. ఏడాదిగా సీఎం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి తిరుగులేని మద్దతు లభిస్తోంది. కాగా, వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనపై 'సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌' (సీసీఎస్‌) జూన్‌ 2 నుంచి 8వ తేదీ వరకూ ఏడాది పాలనపై రాష్ట్రంలో 13 జిల్లాలు, 44 నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఈ సర్వేలో జగన్‌కు జేజేలు పలికినట్లు వెల్లడైంది. మొత్తం 2,881 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి సర్వే చేపట్టింది.

వీరిలో 55.2 శాతం గ్రామీణ, 44.8 శాతం మంది పట్టణ ప్రాంత ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 133-135 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని సీపీఎస్‌ తన సర్వేలో తేల్చింది. అయితే తాజా సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 55.8 శాతం మంది ప్రజలు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని, 38.3 శాతం మంది టీడీపీ, 5.3 మంది బీజేపీ, జనసేన రెండు పార్టీలకు పలికారు.

ఇక ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టాలన్న జగన్‌ సంకల్పాన్ని 71.6శాతం మంది మద్దతు పలికారు. 19.5 శాతం మంది మాత్రమే విబేధించారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల తల్లిదండ్రుల్లో 95 శాతం మంది ఇంగ్లీష్‌ మీడియం కావాలని, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని 75.8శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే తేల్చినట్లు సాక్షి మీడియాలో కథనం వెలువడింది. అలాగే జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని 63.9 శాతం, హామీలు సరిగ్గా నెరవేర్చడం లేదని 35శాతం మంది తెలిపారు.

అన్ని ప్రాంతాల్లో అత్యధిక శాతం ప్రజలు హామీలు అమలవుతున్నాయని చెబితే, ప్రతిపక్షాలు మాత్రం జగన్‌ పాలన ఏ మాత్రం బాగాలేదని విమర్శల వర్షం కురిపించాయి. జగన్‌ సంక్షేమ పథకాలు బాగున్నాయని రాష్ట్రలో 65.3శాతం ప్రజలు అభిప్రాయపడుతుండగా, 33.7శాతం మంది బాగా లేదని చెప్పినట్లు సర్వే లో తేలింది.

Next Story