రాజకీయాలకతీతంగా పథకాలు అందిస్తున్నాం: 'వైఎస్సార్‌ కాపు నేస్తం' ప్రారంభోత్సవంలో జగన్‌

By సుభాష్  Published on  24 Jun 2020 6:56 AM GMT
రాజకీయాలకతీతంగా పథకాలు అందిస్తున్నాం: వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రారంభోత్సవంలో జగన్‌

ఏపీ జగన్‌ సర్కార్‌ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అన్ని వర్గాల వారికి అండగా ఉంటానన్న మాటను నెరవేర్చుకుంటూ వస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ .. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వాలంబన చేకూర్చే విధంగా 'వైఎస్సార్‌ కాపు నేస్తం' పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. తన 13 నెలల పాలనలో ఎక్కడా వివక్షకు తావులేకుండా , రాజకీయాలకతీతంగా పథకాలను అందిస్తున్నామని అన్నారు.3.98 కోట్ల మందికి 43 వేల కోట్ల రూపాయలు నేరుగా అందించామన్నారు.

అమ్మోడి, వసతిదీవెన, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, విద్యాదీవెన, జగనన్న చేదోడు, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఇళ్ల పట్టాల వంటి తదితర సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేశామన్నారు. ఇక వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక సాయం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,37,873 మంది కాపు మహిళల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ కానున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం కాపులకు ఏడాదికి రూ.400 కోట్లు కూడా కేటాయించలేకపోయిందన్నారు.

ఈ పథకం పొందాలంటే అర్హత ఏమిటీ..

♦ ఈ పథకం కాపు, బలిజ, తెగ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 సంవత్సరాలున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది.

♦ ఈ పథకంలో అర్హులు కావాలంటే కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1.44 లక్షలు మించకూడదు.

♦ ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా పది ఎకరాల మెట్ట భూమి ఉండాలి. రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు ఉండరాదు.

♦ ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు. ప్రభుత్వ పెన్షన్‌ కూడా పొందరాదు. అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. ఇక ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్‌కు మినహాయింపు ఇచ్చారు.

Next Story
Share it