కనపడని శత్రువు కొడుతున్న దెబ్బకి యావత్తు ప్రపంచంతోపాటు మన దేశం కూడా వణికిపోతోంది. ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తూ వస్తున్న కోవిడ్ 19 వల్ల 10 వేల మందికి పైగా మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా కరోనా వైరస్ సోకింది. చాలా కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి. వ్యాపారులు చితికిపోతున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే ప్రతికూల ప్రభావం పడింది.

ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అని అన్నారు. ఆయనే వేదాంత రిసోర్సెస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్. ట్విట్టర్ వేదికగా ఈయన ఈ విషయాన్ని వెల్లడించారు.

కష్టాల్లో ఉన్న దేశాన్ని ఆదుకునేందుకు తన వంతు సాయం చేస్తున్నానని.. అందరం కలిసి కట్టుగా కరోనావైరస్ ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ‌‌‌“#DeshKiZarooratonKeLiye అనేది మనమందరం చేపట్టాల్సిన ప్రతిజ్ఞ. ప్రస్తుతం మన దేశానికి మన అవసరం చాలా ఉంది”‌‌ అని అనిల్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ‌ దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా, ఇప్పటికే ప్రముఖ కంపెనీ హిందుస్థాన్ యూనీలివర్ కరోనా వైరస్ పోరాటానికి రూ. 100 కోట్ల సాయం ప్రకటించింది. అంతేకాదు కరోనా వ్యాప్తిని అరికట్టే శానిటైజర్లు, సబ్బుల ధరలను 15శాతం మేర తగ్గిస్తామని తెలిపింది. రానున్న నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బును ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని HUL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా చెప్పారు. పతంజలి, గోద్రెజ్ సహా పలు సంస్థలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి. తమ సబ్బు ఉత్పత్తుల ధరలను 12.5 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

మరోవైపు మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఇప్ప‌టికే త‌న వేత‌నాన్ని విరాళంగా ప్ర‌కటించ‌గా.. మ‌హీంద్రా హాలీడేస్ పేరిట ఉన్న రిసార్టులు, హోటల్స్‌ను క‌రోనా చికిత్స కోసం కేటాయిస్తామ‌ని తెలిపి ఉదార‌త‌ను చాటుకున్నారు.

ఉద్యోగుల ఆరోగ్యం కోసం మహీంద్రా కంపెనీలో వాహన తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దేశంలో కరోనా వైరస్ స్టేజ్ 3కి చేరొచ్చనే నేపథ్యంలో తమ కంపెనీల్లో వెంటిలేటర్ల తయారీ సాధ్యాసాధ్యాలను చర్చిస్తున్నామని తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.