హోమ్‌ క్వారంటైన్.. అయితే సెల్ఫీ పెట్టాల్సిందే.. ఎక్కడంటే..

By అంజి  Published on  22 March 2020 3:27 PM GMT
హోమ్‌ క్వారంటైన్.. అయితే సెల్ఫీ పెట్టాల్సిందే.. ఎక్కడంటే..

కరోనా మహమ్మారి అన్నీ దేశాల్లోనూ తన ఉనికిని చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు తనకు తానుగా నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వాలు సైతం ఎవరికివారే స్వయంగా నిర్బంధంలో ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక, కరోనాతో అల్లకల్లోలం అవుతున్న ఐరోపా దేశాల్లో ఈ ఆంక్షలు మరింత కఠినంగా ఉన్నాయి. ఇక పోలెండ్ ప్రభుత్వమైతే మరో అడుగు ముందుకేసింది. ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించిన ప్రభుత్వం.. తాము నిజంగానే నిర్బంధంలో ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యతను కూడా వారికే అప్పచెప్పింది ఇందుకోసం ప్రత్యేకంగా ‘హోం క్వారంటైన్’ యాప్‌ను తయారు చేసింది.

ప్రజలందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించింది. తాము ఇంట్లోనే ఉన్నట్టు ఎప్పటికప్పుడు సెల్ఫీలు తీసుకుని అందులో అప్‌లోడ్ చేయాలని సూచించింది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే కుటుంబ సభ్యులందరూ కలిసి సెల్ఫీలు దిగి తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసే సెల్ఫీలను ఫేస్ రికగ్నిషన్ సాంకేతిక గుర్తిస్తుంది. అది చూసిన అధికారులు వారు ఇంట్లోనే ఉన్నట్టు ధ్రువీకరిస్తారు. సెల్ఫీ అప్‌లోడ్ చేయాలన్న నోటిఫికేషన్ రాగానే వెంటనే ఆ పని చేయాలి. లేదంటే 20 నిమిషాల్లోపే పోలీసులు వచ్చేస్తారు. ఒకవేళ ఎవరైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోతే వారి ఇళ్లకు పోలీసులు పదేపదే వస్తూ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించుకుంటారు. ఈ యాప్‌లో ఉన్న జియో లొకేషన్, పేస్ రికగ్నిషన్ సాంకేతిక పటిష్టంగా పనిచేస్తుంది.

కేవలం 3.8 కోట్లు జనాభా ఉన్న పోలెండ్‌లో ఇప్పటి వరకు 425 కేసులు నమోదు కాగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Next Story