ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కో–ఆర్డీనేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న వైఎస్ జగన్, ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా, ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు.
సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగంకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అంటోంది.