సమయం కావాలి : ఏపీ సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ లేఖ..

YSRCP rebel MP seeks time to appear before CID in sedition case. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గత ఏడాది నమోదైన దేశద్రోహం

By Medi Samrat
Published on : 17 Jan 2022 7:07 PM IST

సమయం కావాలి : ఏపీ సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ లేఖ..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గత ఏడాది నమోదైన దేశద్రోహం కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి ముందు హాజరు కావడానికి నాలుగు వారాల సమయం కోరారు. జనవరి 17న తమ ముందు హాజరుకావాలని సీఐడీ గత వారం రఘురామరాజుకు నోటీసులు జారీ చేసింది. తాను అస్వస్థతకు గురయ్యానని.. అందుకే విచారణ అధికారి ఎదుట హాజరు కాలేకపోతున్నానని నరసాపురం ఎంపీ సోమవారం సీఐడీకి లేఖ రాశారు. న్యూఢిల్లీ చేరుకున్న తర్వాత తాను అస్వస్థతకు గురయ్యానని, హాజరు కావడానికి నాలుగు వారాల సమయం కావాలని కోరారు.

ఇదిలావుంటే.. తనకు సీఐడీ అందజేసిన నోటీసుపై రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 12న హైదరాబాద్‌లోని ఆయ‌న‌ నివాసంలో సీఐడీ అధికారుల బృందం నోటీసులు అందజేసింది. ఈ సంద‌ర్భంగా గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ అధికారి ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. 153 ఎ, 505, 124-ఎ రీడ్ విత్ 120-బి సెక్షన్ల కింద సీఐడీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో విచారణకు ఎంపీ హాజరు అవసరమని విచారణ అధికారి పేరుతో జారీ చేసిన నోటీసులో పేర్కొంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు తీవ్ర‌ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. మే 14న హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి పోలీసులు అరెస్టు చేసి గుంటూరు తరలించారు. పోలీసు కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేశారని రఘురామరాజు ఆరోపించారు. అయితే త‌ద‌నంత‌రం సుప్రీం కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని కోర్టు కూడా కోరింది.

ఇదిలావుంటే.. సంక్రాంతి రోజున విచారణకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంపై రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. వ్యక్తిగత కక్షతోనే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ దుష్పరిపాలన, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నాపై దేశద్రోహం కేసు ఎలా నమోదు చేస్తారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తనపై అనర్హత వేటు వేయడంలో వైసీపీ విఫలమవడంతో త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయ‌న‌ ఇప్పటికే ప్రకటించారు. ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచి ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఎండ‌గ‌డ‌తాన‌ని అన్నారు.


Next Story