వైనాట్‌ 175 అనడంలో తప్పేముంది..? : ఎంపీ నందిగం సురేశ్

YSRCP MP Nandigam Suresh Fire On Chandrababu. వైసీపీ అధినేత‌, సీఎం జగన్ 2024 ఎన్నికల్లో వైనాట్‌ 175 అనడంలో తప్పేముంది..? అని బాపట్ల

By Medi Samrat
Published on : 14 Jun 2023 9:15 PM IST

వైనాట్‌ 175 అనడంలో తప్పేముంది..? : ఎంపీ నందిగం సురేశ్

వైసీపీ అధినేత‌, సీఎం జగన్ 2024 ఎన్నికల్లో వైనాట్‌ 175 అనడంలో తప్పేముంది..? అని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ప్ర‌శ్నించారు. టీడీపీతో పాటు మిగతా పార్టీలు ఎందుకంత ఫీల్‌ అవుతున్నాయి..? అని అడిగారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు కనీసం 20 శాతం పథకాల్ని కూడా అమలు చేయలేని పార్టీలు 150 స్థానాల్ని దక్కించుకోవాలని పోరాడుతున్నప్పుడు.. మ్యానిఫెస్టో హామీల్లో నాలుగేళ్లల్లో 99.5 శాతం నెరవేర్చి ప్రజల మద్ధతును కూడగట్టుకున్న ముఖ్య‌మంత్రి జగన్ ఈ రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 స్థానాలూ వైఎస్‌ఆర్‌సీపీనే కైవసం చేసుకుంటుందని అనడంలో ఆశ్చర్యమేముంది..? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబులాగా మా నాయకుడు అబద్ధాలు చెప్పలేదు.. తానేం చేయగలడో అదే చెప్పారు.. అదే చేసి చూపించారని అన్నారు. ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్నారు కాబట్టే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్ ని ఆశీర్వదిస్తున్నారు. ఇప్పటికైనా మా జగన్‌ పై ఇష్టానుసారంగా ఎవరైనా నోరుపారేసుకుంటే ప్రజల చేతుల్లో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

మాయమాటలు చెప్పి ప్రజల్ని భ్రమల్లో నింపే చంద్రబాబు రాజకీయాల్ని ఈ రాష్ట్ర ప్రజలు చూసిచూసి అర్ధంచేసుకుని అలిసిపోయారన్నారు. ఇప్పుడు ఆయన కొడుకు లోకేశ్‌ కూడా బాబులానే తయారయ్యాడని.. నోరుతెరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ.. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్‌ ని ఇష్టానుసారంగా దూషిస్తున్నారని అన్నారు. కనీసం, గ్రామ సర్పంచిగా కూడా గెలవలేని లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లు కలిసి అత్యధిక ప్రజాదరణ కలిగిన, ఒంటిచేత్తో 151 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్న మా ముఖ్యమంత్రిని విమర్శిస్తారా..? అసలు, మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకున్నారా..? అని ప్ర‌శ్నించారు. మంగళగిరిలో ఓడిపోయినా మంత్రి పదవి వెలగబెట్టానని లోకేశ్‌ విర్రవీగుతున్నాడేమో.. అది తండ్రి కట్టబెట్టిన అధికారమని తెలుసుకోవాలన్నారు. దమ్ముంటే, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లు ఎమ్మెల్యేలుగా గెలవండి..చూద్దాం. అలాకాదని, మా ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటామంటే ప్రజలు చూస్తూ ఉండరని, తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.


Next Story