వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు. కోవూరులో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు చిత్ర పరిశ్రమ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్ లో ఉన్నారని.. అసలు వారికి ఏపీలో ఒక ప్రభుత్వం ఉందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని కనిపిస్తోందా అని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలంతా చంద్రబాబు మనుషులే.. అని.. ఆయన కులానికి చెందిన వారే ఎక్కువమంది ఇండస్ట్రీలో ఉన్నారంటూ వివాదానికి తెరలేపారు. హైదరాబాద్ లో ఉండి ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పేదల కోసం టికెట్ల ధరలు తగ్గిస్తే వారికి వచ్చిన నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. టికెట్ ధరలు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని.. ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందని ప్రశ్నించారు.
సినిమా టికెట్స్ రేట్లు తగ్గిస్తే తప్పేంటని తెలంగాణలో ఉండి అక్కడ సినిమాలు తీస్తున్న సినీ హీరోలు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. సినిమా హీరోలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, టికెట్ రేటు తగ్గించి పేదవాడు సినిమా చూసేలా చేయడం తప్పా అని ప్రశ్నించారు. పెద్ద హీరోల సినిమా టికెట్లు వంద నుంచి వేల రూపాయల్లో అమ్మారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదని అందుకే ముఖ్యమంత్రి జగన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారన్నారు.