కదిరిలో అన్నంత పని చేసిన టీడీపీ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది.
By Medi Samrat
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నీసాతో పాటు వైస్ ఛైర్మన్లు గంగాదేవి, రాజశేఖర్ రెడ్డిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు 25 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. హాజరైన సభ్యులందరూ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు.
కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, వైఎస్సార్‌సీపీ-30, టీడీపీ-5, ఇండిపెండెంట్ 1 కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి, కదిరి ఆర్డీవో వీవీఎస్ శర్మ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అనుకూలంగా 25మంది కౌన్సిలర్లు ఓటు వేయగా, మద్దతుగా కేవలం 11మంది మాత్రమే ఓటు వేశారు.