ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కమ్యూనిస్ట్ పార్టీలతో ఇండియా కూటమి పొత్తును అధికారికంగా ప్రకటించిన సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్, చంద్రబాబు ఇద్దరూ విఫలమయ్యారని ఆరోపించారు. 2014లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే పదేళ్ళపాటు ప్రత్యేక హోదా అమల్లోకి వచ్చేదని అన్నారు.
ఓ వైపు షర్మిల విమర్శల వర్షం కురిపిస్తూ ఉండగా.. కాంగ్రెస్ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఏపీలో నోటాతో కలిసి ఐదో స్థానం కోసం కాంగ్రెస్ పోటీ పడుతోందని అన్నారు. 2019 ఎన్నికల్లో 32,505 ఓట్ల తేడాతో నోటా చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని.. గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటకల అనుభవంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా ఈజీగా చీలిపోతారని అన్నారు. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు కూడా వేస్టేనని అన్నారు. ఎన్నికల్లో గెలిచే పార్టీకే ఓటు వేయాలని, వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల ఎలా స్పందిస్తారో.