లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు అక్కడకు వెళ్లారు : దేవినేని అవినాష్
రూ.100 కోట్ల ప్రజాధనంతో చంద్రబాబు, ఆయన కొడుకు దావొస్ పర్యటనకు వెళ్లి రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాలేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు.
By Medi Samrat Published on 24 Jan 2025 3:43 PM ISTరూ.100 కోట్ల ప్రజాధనంతో చంద్రబాబు, ఆయన కొడుకు దావొస్ పర్యటనకు వెళ్లి రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాలేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఈ పర్యటన వలన కొంచెం కూడా లాభం లేదన్నారు. నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు.. దావోస్ పర్యటన వలన ఏ పెట్టుబడులు వచ్చాయి అనేది ప్రజలకు చెప్పండని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర రెండు లక్షల కోట్లు, తెలంగాణ లక్షా యాభై వేల కోట్లు ఒప్పందం చేసుకున్నాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ ఏటువంటి ఒప్పదాలు చేసుకోలేదన్నారు. చంద్రబాబు ఐదు సార్లు వెళ్లి.. జగన్ ఒక్కసారి వెళ్ళిన దానితో సమానం.. కావాల్సినన్ని పెట్టుబడులు తెచ్చారన్నారు. రాష్ట్రాన్ని జగన్ ఆన్ని విధాల అభివృద్ధి చేశారని తాము గర్వంగా చెప్పగలం అన్నారు.
చంద్రబాబు, లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తేవాలన్నారు. ప్రజాధనంతో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం అన్నారు. ప్రజల్లోకి వెళ్తే పథకాలు గురించి నిలదీస్తారని వెళ్ళటమే మానేశారన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మధ్య వార్ జరుగుతుంది.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. తూర్పు బైపాస్‌పై ప్రకటనలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశారన్నారు.
కుటమి నేతలు ఎందుకని ఇక్కడ ప్రజల మీద కక్ష కట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ఇక్కడ ఎంపీ కలిసి కేంద్ర పెద్దలతో మాట్లాడి తూర్పు బైపాస్‌కు ఒప్పించాలన్నారు. కూటమి నేతలు ప్రతి పనిలో కలెక్షన్లు వెత్తుక్కొనే దానిలో ఉన్నారని.. కలెక్షన్, కరప్షన్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారన్నారు.. తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నారు. సొంత ప్రమోషన్ల కోసం దుర్వినియోగం చేసిన సొమ్ముపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగ్గయ్య పేటలో దొరికిన గంజాయిపై మాట్లాడాలి.. గంజాయి నిర్మూలన చేస్తాం అని చెప్పిన నేతలు.. ఇప్పుడు నోరు విప్పాలి.. అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలిపాలన్నారు. చంద్రబాబు హయాంలో కాల్ నాగ్‌లు మళ్ళీ పడగ విప్పుతున్నారు.. పేద వారిని దోచుకొవటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పేద ప్రజలకు తాము అండగా ఉంటామని.. బూత్ కమిటీల ద్వారా వైసీపీని మరింత బలోపేతం చేస్తామన్నారు.