కశ్మీర్‌లో మే 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ సాయం అందించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. కల్లి తండాకు వెళ్లి మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు.
మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అమర జవాను మురళీనాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.