అదానీతో ఎలాంటి డైరెక్ట్ ఒప్పందం చేసుకోలేదు : వైసీపీ క్లారిటీ
2021లో ఆంధ్రప్రదేశ్‌కు 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి తప్పు చేయలేదని వైఎస్సార్‌సీపీ వివరణ ఇచ్చింది.
By Medi Samrat Published on 22 Nov 2024 8:52 AM ISTఆగస్టులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (PPA) కుదుర్చుకోవడానికి భారత ప్రభుత్వ అధికారులకు రూ. 1,700 కోట్లకు పైగా లంచం ఇచ్చారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మరో ఆరుగురిపై US న్యాయవాదులు అభియోగాలు మోపిన నేపథ్యంలో పలు రాష్ట్రాలలో చర్చ జరిగింది. 2021లో ఆంధ్రప్రదేశ్‌కు 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి తప్పు చేయలేదని వైఎస్సార్‌సీపీ వివరణ ఇచ్చింది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థసెకీ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో మాత్రమే ఒప్పందం చేసుకుందని, అదానీ గ్రూప్‌తో ఏపీ డిస్కమ్‌లు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని వైసీపీ స్పష్టం చేసింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని వైసీపీ ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా కల్పించాలనే లక్ష్యంతో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలుకు సెకీతో 2021 డిసెంబర్ 1న ఏపీ డిస్కమ్‌లు ఒప్పందం చేసుకున్నాయని వివరించింది. యూనిట్ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో 2024–25లో మూడు వేలు, 2025–26లో మూడు వేలు, 2026–27లో వెయ్యి మెగావాట్లను అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలను మినహాయించుని సరఫరా చేయడానికి సెకీ అంగీకరించిందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది.