పాదయాత్రపై జగన్ సంచలన ప్రకటన..ఏడాదిన్నర తర్వాత నుంచి యాక్షన్ ప్లాన్
మరోసారి పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.
By - Knakam Karthik |
పాదయాత్రపై జగన్ సంచలన ప్రకటన..ఏడాదిన్నర తర్వాత నుంచి యాక్షన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్: మరోసారి పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత ఏలూరు నుంచే దీన్ని మొదలుపెడతానని ఆ నియోజకవర్గ నేతల మీటింగ్‌లో తెలిపారు. పాదయాత్ర ద్వారా ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. అంతకుముందు ప్రతీవారం ఒక్కో నియోజకవర్గం నాయకులతో భేటీ అవుతానని పేర్కొన్నారు. ఇక ముందు వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశం అవుతాం..అని జగన్ అన్నారు.
వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పిన జగన్..ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే అని జోస్యం చెప్పారు. పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోందని ఆరోపించారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారు అని ఘాటుగా విమర్శించారు.
పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్, అన్ని కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదని, ఏ ఒక్క పథకం ఆపలేదని జగన్ అన్నారు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం, చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత, ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ఉండరని అంతా గుర్తించారు. సూపర్‌సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదు అన్నీ మోసాలే, వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంట్ స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి...అని జగన్ విమర్శించారు.