అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన జనాభా విధానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉన్న బిడ్డలకే దిక్కులేని ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురు పిల్లలను కనమనడం హాస్యాస్పదమని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 25 వేల కోసం మూడో బిడ్డను కనాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఉద్యోగాలు లేక యువత ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటూ బతుకుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 12 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశాయని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవని, కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 6 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టి, మరోవైపు విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై రూ. 15 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలను బిడ్డలను కనమని కోరడంపై ఆమె చంద్రబాబును నిలదీశారు.