ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఉగాది జాబ్ క్యాలెండర్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతను వంచించడమేనని ఆమె ఆరోపించారు. "కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లు" ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను తీవ్ర నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని వాస్తవ ఖాళీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటిని ఎప్పటిలోగా భర్తీ చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. వీటితో పాటు, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని ఆమె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.