ఇప్పుడున్న జగన్.. పాత జగనన్న కాదు : ష‌ర్మిల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కడప జిల్లా నాకు పుట్టిళ్లు అని వైఎస్ ష‌ర్మిల‌ అన్నారు వైఎస్సార్, జగన్ పుట్టిన జమ్మలమడుగు ఆసుపత్రిలోనే నేనూ పుట్టానని పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  29 Jan 2024 11:46 AM GMT
ఇప్పుడున్న జగన్.. పాత జగనన్న కాదు : ష‌ర్మిల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కడప జిల్లా నాకు పుట్టిళ్లు అని వైఎస్ ష‌ర్మిల‌ అన్నారు వైఎస్సార్, జగన్ పుట్టిన జమ్మలమడుగు ఆసుపత్రిలోనే నేనూ పుట్టానని పేర్కొన్నారు. క‌డ‌ప జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం అయ్యాక జగన్ మారిపోయారని.. ఈ జగన్ నాకు తెలియదు.. ఇప్పుడున్న జగన్.. పాత జగనన్న కాదని అన్నారు. నా ఇంటిని.. పిల్లలను పక్కన పెట్టి వైసీపీ కోసం పాదయాత్ర చేశానని.. ఎలాంటి స్వార్థం లేకుండా పాదయాత్ర చేశాన‌ని పేర్కొన్నారు. వైసీపీ ఉనికి పోతుందనుకున్న రోజుల్లో ఆ భారం అంతా నా భుజన వేసుకుని మోశానన్నారు. అలాంటి పార్టీలో ఎదిగిన నేతలు నన్ను టార్గెట్ చేశారని.. వ్యక్తిగతంగా నాపై దాడి చేస్తున్నారని అన్నారు. నా భర్త అనిల్‍ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు.

చనిపోయిన ప్రణబ్ ముఖర్జీ పేరు తెరపైకి తెచ్చారు. నా భర్తకు, నాకు పదవీ కాంక్ష లేదన్నారు. నాకు పదవీ కాంక్ష ఉంటే.. మీ కోసం పాదయాత్రలు ఎందుకు చేస్తా.? నాకు సీఎం పదవి కావాలని నా భర్త అడిగినట్లు మీరు నిరూపిస్తారా? అని స‌వాల్ విసిరారు. భారతీరెడ్డితో కలిసే అనిల్ వెళ్లి కాంగ్రెస్ నేతలను కలిశారు. నాకు పదవి కావాలని అడిగినట్లు భారతీరెడ్డితో చెప్పిస్తారా? అని నిల‌దీశారు. మీ జోకర్లతో నన్ను తిట్టిస్తే ఏమొస్తుంది? అని అడిగారు. సాక్షి మీడియా నా మీద రెచ్చగొట్టే పనులు చేయిస్తోంది. తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వారికి ఫోన్లు చేసి మీరు మాట్లాడండి. మేము కవరేజీ ఇస్తామని రెచ్చగొడుతోందని ఆరోపించారు. పదవుల కోసం ఇంతలా దిగజారాలా? సాక్షిలో జగన్‍కు ఎంత భాగముందో.. నాకూ అంతే భాగం ఉంది. వైఎస్సార్ ఉన్నప్పుడు జగన్‍కు ఎంత ఇచ్చారో.. అంతే నాకూ ఇచ్చారు. అలాంటి సాక్షిలో నా మీద తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు? అని ప్ర‌శ్నించారు. బుద్ధి, జ్ఞానం ఉంటే ఇలా చేస్తారా? విలువలు, విశ్వసనీయత ఉంటే ఇలా చేస్తారా? అని ఫైర్ అయ్యారు. నేను వైఎస్సార్ బిడ్డను.. ఇక్కడే నిలబడతా.. ఇక్కడే కొట్లాడతా - ఏపీకి మేలు జరిగే వరకు ఇక్కడే ఉంటా.. ఇక్కడే కొట్లాడతా.. ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Next Story