మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే మళ్లీ వైసీపీలో చేరారు. కొద్దిరోజుల కిందట వైసీపీని వీడుతున్నానని చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకున్నారు. పలువురు వైసీపీ నేతలతో మాట్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్‌పై విజయం సాధించారు. ఇటీవల గంజి చిరంజీవిని పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ పరిణామాలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఆర్కే నాకు చాలా దగ్గర మనిషి, ఆయన ఎక్కడున్నా బాగుండాలని అన్నారు. ఆయన సమానంగా ఉండాలని.. సంతోషంగా ఉండాలని కోరుకుంటానని అన్నారు. ఆయన మీద చాలా ఒత్తిడులు ఉన్నాయని, ఒక చెల్లెలిగా ఆయనను అర్థం చేసుకున్నానని అన్నారు. ఒక మంచి పర్సన్ రాంగ్ ప్లేస్ లో ఉన్నారని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తును అధికారికంగా ప్రకటించే సందర్భంలో ఆర్కే గురించి మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.