ప్రధాని మోదీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి : వైఎస్ షర్మిల

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.

By Medi Samrat
Published on : 17 April 2025 8:32 PM IST

ప్రధాని మోదీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి : వైఎస్ షర్మిల

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. మోదీ పర్యటనపై వైఎస్ షర్మిల స్పందించారు. అమరావతి రైతుల ఉద్యమం ఢీల్లీ దాకా పాకితే కనీసం స్పందించలేదు ఎందుకు ? ఢీల్లీనీ మించిన రాజధాని కట్టిస్తామని ఇచ్చిన హామీ మరిచిపోయారా అంటూ షర్మిల ప్రశ్నించారు.

"చెంబేడు నీళ్ళు, గుప్పెడు మట్టి ఇదే అమరావతికి ప్రధాని మోడీ గారు చేసిన సహాయం. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టారు. ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారు. చివరికి ఆత్మగౌరవం అమరావతిని "మోడీ శంకుస్థాపనల ప్రాజెక్ట్ " కింద మార్చేశారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసం. రాష్ట్రానికి చేసింది ద్రోహం. పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేసి.. రూ.15వేల కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటు.

నిజంగా అమరావతిపై మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా ? రాజధాని పనులపై ఒక్కనాడైనా బాధ్యతగా అడిగారా ? ఒక్క రూపాయి నిధులైనా అమరావతికి కేటాయించారా ? 3d గ్రాఫిక్స్ అమలు సంగతేంటని చంద్రబాబును ప్రశ్నించారా ? గత YCP ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా ? ఇది తప్పని మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు ? అమరావతి రైతుల ఉద్యమం ఢీల్లీ దాకా పాకితే కనీసం స్పందించలేదు ఎందుకు ? ఢీల్లీనీ మించిన రాజధాని కట్టిస్తామని ఇచ్చిన హామీ మరిచిపోయారా ?ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి. 10 ఏళ్లు దాటినా రాష్ట్రానికి రాజధాని లేదంటే.. ఇందుకు ప్రధాన ముద్దాయి A1 మోడీ గారు. A2 చంద్రబాబు గారు. A3 జగన్ మోహన్ రెడ్డి గారు

వచ్చే నెల 2న అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీ గారిని ఏపీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏపీ నూతన రాజధాని నిర్మాణం విభజన హామీలో ఒకటి. కేంద్రమే పూర్తి నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్. ఆంధ్రుల రాజధాని అమరావతికి పూర్తి స్థాయి నిధులు ప్రకటన చేయాలి. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వైజాగ్ స్టీల్ ప్లాంటు SAILలో విలీనంతో పాటు, కడప స్టీల్,వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు లాంటి పెండింగ్ విభజన హామీలపై మీ వైఖరి తేల్చాలి. పోలవరం ఎత్తు 45 మీటర్లా ? లేక 41 మీటర్లకే పరిమితమా ? మోడీ గారు క్లారిటీ ఇవ్వాలి. " అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ వేశారు.

Next Story