5 నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు.. ఇది న్యాయమా చంద్రబాబు.? : వైఎస్ షర్మిల

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది.. 5 నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు.. 5 నెలల్లో చుక్కలు చూపిస్తున్నారు..

By Medi Samrat  Published on  6 Nov 2024 5:09 PM IST
5 నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు.. ఇది న్యాయమా చంద్రబాబు.? : వైఎస్ షర్మిల

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది.. 5 నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు.. 5 నెలల్లో చుక్కలు చూపిస్తున్నారు.. దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. విజయవాడ చౌక్ వద్ద ఏపీసీసీ చేప‌ట్టిన ధర్నాలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే 6 వేల కోట్ల భారం మోపారు.. ఇది చాలదు అన్నట్లు ఇంకో 11 వేల కోట్లు సిద్ధం చేశారు.. మొత్తం 17 వేలకోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు.. ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు గారు..? అని ఆమె ప్ర‌శ్నించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలపై ఎన్నో హామీలు ఇచ్చారు. వైసీపీ 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టారు.. తెలుగు దేశం అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదు అన్నారు.. వైసీపీ 35 వేల కోట్లు భారం వేసింది అని చెప్పారు.. కూటమి అధికారంలో వచ్చాకా చార్జీలు 30 శాతం తగ్గిస్తామని చెప్పారు.. అధికారంలో వచ్చాకా మాట మార్చారు.. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా..? ప్రతిపక్షంలో ఉన్న‌ప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా..? అని ప్ర‌శ్నించారు. జగన్ మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 35 వేల కోట్లు భారం మోపితే.. మీ 5 నెల్ల పాలనలో 17 వేల కోట్లు భారమా.? ఇది న్యాయమా చంద్రబాబు.? అని ప్ర‌శ్నించారు.

విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి అన్నారు.. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలి.. కానీ భారాన్ని ప్రజలపై ఎందుకు మోపుతున్నారు.? చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.. గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపుతారా.? బాబు గారు కేంద్రం నుంచి నిధులు తీసుకు రండి.. సెంట్రల్ ఈఆర్‌సీ మీ చేతుల్లోనే ఉంది.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి విద్యుత్ బిల్లులు మీరే చెల్లించండి అని సూచించారు.

బీజేపీకి గత 10 ఏళ్లుగా ఊడిగం చేస్తున్నారు కదా.? బీజేపీకి మద్దతు ఇచ్చిన మీరు నిధులు తేవాలి కదా.? ప్రజల నెత్తిన విద్యుత్ భారం వేస్తే ఊరుకోం అన్నారు. వెంటనే సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలు లో ఫెయిల్ అయ్యారు.. సంక్షేమ పథకాలు అని చెప్పి.. ఒక చేత్తో ఇస్తున్నారు.. మరో చేత్తో వసూలు చేస్తున్నారు.. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు.. ఇచ్చేది 25 వందలు.. వసూలు చేసేది 6 వేల కోట్లు.. ఇచ్చేది పావలా... వసూలు చేసేది రూపాయి అని ఆరోపించారు. సర్దుబాటు భారం వైసీపీదే.. కాదని ఎవరు అనడం లేదు.. తప్పు చేశారు కాబట్టే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారు. 35 వేల కోట్ల భారం వేశారు కాబట్టే ప్రజలు వైసీపీని ఓడించారు.. ఇది వైసీపీ చేసిన పాపం అయితే.. కూటమి పెడుతున్న శాపం.. వైసీపీకి కూటమికి తేడా లేదన్నారు.

Next Story