తురకపాలెం మృత్యుఘోషపై ప్రభుత్వం స్పందించాలి : షర్మిల

గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో గత ఎనిమిది నెలల వ్యవధిలో ఏకంగా 32 మంది గ్రామస్థులు అనుమానాస్పద రీతిలో మరణించారు.

By Medi Samrat
Published on : 5 Sept 2025 6:45 PM IST

తురకపాలెం మృత్యుఘోషపై ప్రభుత్వం స్పందించాలి : షర్మిల

గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో గత ఎనిమిది నెలల వ్యవధిలో ఏకంగా 32 మంది గ్రామస్థులు అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తురకపాలెం ఎస్సీ కాలనీలో సుమారు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలన్నీ తాగునీటి అవసరాల కోసం స్థానికంగా ఉన్న ఒక క్వారీ కుంటపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నీరు కలుషితం కావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయా? లేక మరేదైనా అంతుచిక్కని వ్యాధి ప్రబలిందా? అనే కోణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

వైఎస్ షర్మిల స్పందిస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యానికి తురకపాలెం మరణాలే నిదర్శనమని ఆమె విమర్శించారు. గత 5 నెలలుగా వరుస మరణాలు సంభవిస్తుంటే రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ ఉన్నట్లా? లేనట్లా? ఇప్పటికి 35 మంది ఒకే విధంగా చనిపోతే కారణం కనుక్కొని, నివారించకపోవడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. తురకపాలెం మృత్యుఘోషపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. వైద్యారోగ్య శాఖ తరఫున ఉన్నతస్థాయి కమిటీ వేసి, గ్రామంలోని ప్రతి ఒక్కరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని షర్మిల కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు.

Next Story