అలా చెప్పడం మోసం : వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మడి సంధ్యరాణి కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 7 March 2025 5:40 PM IST

అలా చెప్పడం మోసం : వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మడి సంధ్యరాణి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితం అని మంత్రి సంధ్యారాణి మండలిలో తెలిపారు. ఉచిత బస్సు పథకం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని వైసీపీ సభ్యుడు పీవీ సూర్యనారాయణరాజు అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా ఉంటుందని అన్నారు. అయితే ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

ఈ నిర్ణయంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు కండిషన్ అప్లై అనడం దారుణం అని షర్మిల విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం జిల్లా స్థాయి వరకే పరిమితం అని చెప్పడం మోసం. అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేక ఇలాంటి సాకులు చెబుతున్నారు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి అని అన్నారు షర్మిల. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణమేనని షర్మిల స్పష్టం చేశారు. ఇటువంటి మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడంలేదన్నారు.

Next Story