ఏపీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. రైతులను పరామర్శించిన వైఎస్ జగన్

పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు.

By Knakam Karthik
Published on : 24 March 2025 1:16 PM IST

Andrapradesh, Ys Jagan, Ysrcp, Tdp, Cm Chandrababu,

ఏపీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు..రైతులను పరామర్శించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచాయి. పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. ఉదయం వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డిపల్లికి జగన్ చేరుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తమ ప్రభుత్వ హయాంలో పంట బీమాను రైతుల హక్కుగా అమలుచేశామని చెప్పారు. రైతు భరోసా నిధులు క్రమం తప్పకుండా అందించామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పంట బీమాకు మంగళం పాడారని విమర్శించారు. గత ఏడాదికి చెందిన రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా ఆపేసిందని మండిపడ్డారు. రైతు భరోసా కాదు తాము అధికారంలోకి వచ్చాక రైతుకు రూ.26 వేలు అందిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు 26 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. ‘కళ్లు మూసుకుంటే ఏడాది గడిచిపోయింది. మళ్లీ కళ్లుమూసుకుని తెరిస్తే మూడేళ్లు గడిచిపోతాయి. రైతు సోదరులకు ఒకటే చెబుతున్నా.. మూడేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం. అని వైఎస్ జగన్ చెప్పారు.

ఇప్పుడు పెండింగ్ లో పెట్టిన నిధులను విడుదల చేస్తాం. ఇన్ పుట్ సబ్సిడీతో పాటు పంట బీమా, రైతు భరోసా నిధులు అందజేస్తాం’ అని జగన్ చెప్పారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉందని గుర్తుచేస్తూ.. అయినప్పటికీ పార్టీ తరఫున రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడతామని వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు పంట బీమా డబ్బులు అందించేలా చూస్తామన్నారు. అదేవిధంగా, వైసీపీ తరఫున కూడా తోచినంత సహాయం అందించే ప్రయత్నం చేస్తామని మాజీ సీఎం జగన్ రైతులకు హామీ ఇచ్చారు.

Next Story