సత్యమేవ జయతే అంటూ వైఎస్ జగన్ ట్వీట్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అరెస్టు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు.

By -  Medi Samrat
Published on : 27 Sept 2025 8:20 PM IST

సత్యమేవ జయతే అంటూ వైఎస్ జగన్ ట్వీట్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అరెస్టు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం సుమోటోగా ఇచ్చిన ఈ తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని తెలుపుతూ 'సత్యమేవ జయతే' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. తాడేపల్లిలో నివాసం ఉంటున్న సవీంద్ర రెడ్డిని లాలాపేట పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆ తర్వాత పత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కేసులో అరెస్టు చూపించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుపై సమగ్ర విచారణ జరిపి ప్రాథమిక నివేదికను తమకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

దీనిపై స్పందించిన వైఎస్ జగన్ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు హైకోర్టు నిర్ణయమే నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు కనీసం హైకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదని,ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతులను అణిచివేస్తున్నారని, భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అక్రమ కేసులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు సర్వసాధారణంగా మారాయని, సెక్షన్ 111ని దుర్వినియోగం చేయడం నిత్యకృత్యమైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో, సరైన విచారణ జరిపి ప్రజల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని హైకోర్టు తన ఆదేశాల ద్వారా స్పష్టం చేసిందని జగన్ ట్వీట్ చేశారు.

Next Story