ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు.. నవ్వుతూ సైగలు చేసిన జగన్
YS Jagan Slams Chandrababu in AP Assembly. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి.
By Medi Samrat Published on 30 Nov 2020 10:49 AM GMT
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి పక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆవేశంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటే.. అధికార పక్ష నేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవ్వుతూ కనిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో పోడియం ముందు కూర్చుని, నిరసన వ్యక్తం చేశారు. శాసనసభలో తుపాను పంట నష్టంపై చర్చ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు మాట్లాడేందుకు యత్నించగా అధికారపక్షం అడ్డుకుంది. దీంతో చంద్రబాబు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. ఈ నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ సభలో చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. వయసుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించాలని కోరారు.
స్పీకర్ ఎంత చెప్పినా వినకుండా పోవడంతో చంద్రబాబుతో పాటు 12 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, గద్దె రామ్మోహన్, జోగేశ్వరరావు, సత్యప్రసాద్, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్ లను సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ తెలిపారు.