తప్పును గుడ్డిగా సమర్థిస్తూ సనాతన ధర్మమని చెప్పుకోవడం ధర్మమా అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇది అబద్ధమని తెలిసినా దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెక్కలు కట్టారని వైఎస్ జగన్ విమర్శించారు. అబద్ధాలతో తిరుమల విశిష్టతను దెబ్బతీయడమేనా సనాతన ధర్మం అని ప్రశ్నించారు.
తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని, దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పినా దురుద్దేశంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బతియడంలో పవన్ కళ్యాణ్ కూడా భాగమయ్యారని ఆరోపించారు వైఎస్ జగన్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో వీళ్లు ఆడుకుంటున్నారు. వాళ్లకు వెంకన్న స్వామే మొట్టికాయలు వేస్తారని అన్నారు వైఎస్ జగన్. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదని, వెంకటేశ్వర స్వామితో ఆటలాడవద్దని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు చేసిన పాపానికి దేవుడి కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడవద్దని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానన్నారు. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసిన వారిపైనే దేవుడి తన కోపం చూపించాలన్నారు వైఎస్ జగన్.