తాడేపల్లిగూడెం నియోజకవర్గ కేడర్ సమావేశంలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాజెక్టును ఒక 'దోపిడీ గని'గా అభివర్ణించిన ఆయన, చంద్రబాబు కేవలం కాంట్రాక్టుల కమీషన్ల కోసమే దీన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేయడమే బాబు లక్ష్యమని విమర్శించారు.
రాజధానిపై జగన్ రెండు ప్రత్యామ్నాయాలను కేడర్ ముందుంచారు. మొదటిది.. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని కొనసాగించడం ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించారు. రెండవది.. ఒకవేళ వికేంద్రీకరణ కాదనుకుంటే, మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు ప్రాంతాలతో కూడిన 110 కిలోమీటర్ల 'మావిగన్' (MAVIGAN) కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేయడం సరైన ఆప్షన్ అని పేర్కొన్నారు.
అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు, అందులో కేవలం 10 శాతం నిధులతోనే 'మావిగన్' ప్రాంతంలో అద్భుతమైన మౌలిక వసతులు కల్పించవచ్చని జగన్ వివరించారు. ఇతర మెట్రో నగరాల్లో చదరపు అడుగు ధర రూ. 4,500 ఉంటే, అమరావతిలో రూ. 14,000 కట్టబెట్టడం అతిపెద్ద దోపిడీ అని ధ్వజమెత్తారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకూడదని, అమరావతి కేవలం కొందరు సంపన్నుల ప్రయోజనాల కోసమేనని ఆయన స్పష్టం చేశారు.