అలా చేస్తే వ్యాక్సిన్లు మరింత వేగంగా ఇవ్వొచ్చు.. పీఎం మోదీతో సీఎం జ‌గ‌న్‌

YS Jagan participates in PM Modi's video conference over covid-19. కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర

By Medi Samrat  Published on  16 July 2021 9:42 AM GMT
అలా చేస్తే వ్యాక్సిన్లు మరింత వేగంగా ఇవ్వొచ్చు.. పీఎం మోదీతో సీఎం జ‌గ‌న్‌

కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం వైయస్‌ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవు. అయినా సరే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనపరిచామ‌ని అన్నారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయని.. ఇప్పటివరకూ 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశామ‌ని అన్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఫోకస్‌గా టెస్టులు చేశామ‌ని.. దీనివల్ల కోవిడ్‌ విస్తరణను అడ్డుకోగలిగామ‌ని తెలిపారు. వ్యాక్సినేషన్‌ అనేది కోవిడ్‌కు సరైన పరిష్కారమ‌న్న జ‌గ‌న్‌.. ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు.

కేంద్రం నుండి 1,68,46,210 వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చామ‌ని తెలిపారు. వ్యాక్సినేషన్‌లో మంచి విధానాల వల్ల ఇచ్చినదానికన్నా ఎక్కువ మందికి వేయగలిగామ‌ని పేర్కొన్నారు. జులై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని అన్నారు. జూలై నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారని.. కాని క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారని.. జూన్ నెలలో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేన‌ని ప‌రిస్థితిని వివ‌రించారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నామ‌ని.. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. కోవిడ్ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామ‌ని జ‌గ‌న్‌.. పీఎం మోదీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన‌గా.. ఇతర శాఖ‌ల‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు.



Next Story