ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర భారతదేశంలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ రేపట్నుంచి ఐదు రోజుల పాటు కుటుంబంతో సిమ్లా వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గన్నవరం నుంచి చండీగఢ్‌కు బయల్దేరుతారు. ఇక సాయంత్రం 4 గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్‌కు చేరుకుంటారు. ఈ నెల 28వ తేదీన సీఎం వైఎస్ జగన్-భారతిల పెళ్లి రోజు. వారికి వివాహమై 25 ఏళ్లు అవుతోంది. మ్యారేజ్ డే పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్తున్నారు.
ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఇంతకుముందే వాదనలు పూర్తవ్వగా.. విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు వాదనలు పూర్తయ్యాయి. జగన్ పై పిటిషన్ విషయంలో ఈ రోజు తీర్పును వెలువరిస్తామని గత విచారణ సందర్భంగా ప్రకటించిన కోర్టు.. తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామని నేడు తెలిపింది. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరి పిటిషన్లపై తీర్పును ఒకే రోజున వెలువరిస్తామని చెప్పింది.