చంద్రబాబుపై వ్యతిరేకత వచ్చేసింది : వైఎస్ జగన్

మన ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి మనం ఎంతో చేశామని, అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.

By Medi Samrat  Published on  19 Dec 2024 12:00 PM GMT
చంద్రబాబుపై వ్యతిరేకత వచ్చేసింది : వైఎస్ జగన్

మన ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి మనం ఎంతో చేశామని, అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఆరు నెలలు కూడా తిరగకముందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపై రాలేదని అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నేతలతో జరిగిన భేటీలో వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రజల తరపున మనం గొంతు విప్పాలని, నాయకులుగా ఎదగడానికి మీకు ఇదొక అవకాశం అని అన్నారు వైఎస్ జగన్. వైసీపీ హయాంలో మేనిఫెస్టోకు పవిత్రతను తీసుకొచ్చామని తెలిపారు. కరోనా వచ్చినా, ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా సాకులు చూపకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశామని చెప్పారు. ఆరు నెలలు గడవకుండానే చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని చెప్పారు. చంద్రముఖిని లేపడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని ఆరోజు చెప్పానని, ఈరోజు దాన్ని చంద్రబాబు నిజం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.

Next Story