వైఎస్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం ద్వారా ప్రభుత్వం మరోసారి మెరుగైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర భూసర్వే తొలిదశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 2022 డిసెంబర్ నాటికి 11,501 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. నేటి నుంచి 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవల నమోదు కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించిన ఆయన.. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా సమగ్ర సర్వే నిర్వహిస్తామని, తమ గ్రామాల్లోనే తమ ఆస్తులను నమోదు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇంత మంచి సంస్కరణ నేడు అమలవుతున్నదని సీఎం జగన్ అన్నారు. భూ దస్తావేజులు తారుమారు అయినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూములకు హద్దులు లేవని, 90 శాతం భూకేసులు సివిల్ వివాదాలకు సంబంధించినవేనని వైఎస్ జగన్ అన్నారు. శాస్త్రీయ పద్ధతిలో భూములను గుర్తించినట్లయితే వివాదాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.