అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయాం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ సారథ్యంలో స్కామ్‌లు తప్ప మరేమీ జరగడంలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

By Knakam Karthik  Published on  12 Feb 2025 4:49 PM IST
Andrapradesh, YS Jagan Mohan Reddy, Ysrcp, Tdp, Cm Chandrababu

అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయాం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ సారథ్యంలో స్కామ్‌లు తప్ప మరేమీ జరగడంలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019-2024 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడించిందని.. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందని అన్నారు. లంచాలకు తావు లేకుండా రూ.2.71 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని తెలిపారు.

రాష్ట్రంలో దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ లేదని విమర్శించారు. యథేచ్చగా పేకాట క్లబ్‌లు నడుస్తున్నాయని, ఇసుక, లిక్కర్ స్కామ్‌లు చేస్తున్నారని ఆరోపించారు. చట్టానికి విరుద్ధంగా పని చేసే వారిని, అన్యాయాలు చేసేవారాని వదలిపెట్టే ప్రసక్తే లేదని జగన్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని జగన్ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని దొంగ కేసులు పెడతారని, అరెస్ట్ లు చేస్తారని అన్నారు. రాబోయే వైసీపీ ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తానని జగన్ చెప్పారు. మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ రెండే మున్సిపాలిటీలు గెలిచిందని.. మనం గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండు కూడా పోయేవని చెప్పారు. ఇప్పుడు టీడీపీ తప్పుడు సంప్రదాయాలకు పాల్పడుతోందని అన్నారు.

ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చీటర్ కాదా? ఆయనపై 420 కేసు పెట్టకూడదా? అని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని... 10 శాతం ఓట్లు తగ్గడానికి కారణం తాను వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పకపోవడమేనని అన్నారు. ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే... ప్రజలను మోసం చేసి, ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంలోని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమేనని, అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు.

Next Story