నకిలీ మద్యం ఘటనపై ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. నకిలీ మద్యం వెనుక ఉన్న వాళ్లంతా సీఎం చంద్రబాబు మనుషులేనని, నిందితుడు జనార్ధన్ రావుతో అబద్దాలు చెప్పించారని ఆరోపించారు. తప్పు చేసి ఆ నెపాన్ని అవతలి వాళ్లపై నెట్టడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు వైఎస్ జగన్. నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డాటా సెంటర్‌పై కూటమి ప్రభుత్వం.. దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాల్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు.
ఉద్యోగులకే కాదు, ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారని వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలోనే కనిపిస్తున్నాయని, స్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయని, ఇంగ్లీష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయన్నారు. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయన్నారు. కనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి 104, 108 సర్వీసులను అప్పజెప్పారని వైఎస్ జగన్ ఆరోపించారు.