చంద్రబాబు లండన్ కు.. నారా లోకేష్ మ్యాచ్ చూడడానికి వెళతారు: వైఎస్ జగన్
కృష్ణా జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు.
By - Medi Samrat |
కృష్ణా జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులందరికీ తక్షణమే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ పథకం ద్వారానే ఉపశమనం లభిస్తుందని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుపాను వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, కేవలం వరి పంటే 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం పంట నష్టం అంచనాలను తూతూమంత్రంగా చేపట్టిందని ఆరోపించారు. ఒక్క రోజులోనే లెక్కింపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని, కానీ క్షేత్రస్థాయిలో ఏ అధికారి పర్యటించలేదని 25 జిల్లాల రైతులు చెబుతున్నారన్నారు. పంటల బీమాను రద్దు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని, దాని ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ విమర్శించారు.
బీమా ప్రీమియం చెల్లించకపోవడం ప్రభుత్వ తప్పిదమే కాబట్టి, బకాయిపడ్డ రూ.600 కోట్లను ప్రభుత్వమే చెల్లించి, రాబోయే రబీ సీజన్‌కు కూడా ప్రీమియం కట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే, చంద్రబాబు ఏరియల్ సర్వే చేసి లండన్ వెళతారు... ఆయన కుమారుడు లోకేశ్ ఏమో ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూస్తారు, రైతులను గాలికి వదిలేశారని జగన్ ధ్వజమెత్తారు.